కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు చేశారు. 1966 నవంబర్ 20న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశ న్యాయవ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
‘కాంగ్రెస్ చీకటి అధ్యాయం-249’ పేరుతో చేసిన పోస్టులో న్యాయవ్యవస్థలో నియామకాలు, బదిలీల అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం న్యాయవ్యవస్థలో నియామకాలకు నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని ఆర్టికల్ 235 ప్రకారం జిల్లా, ప్రధాన జిల్లా న్యాయమూర్తుల బదిలీల అధికారం సంబంధిత రాష్ట్రాల హైకోర్టులకే ఉంటుందని పేర్కొన్నారు.
1966లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగువ కోర్టుల్లో తమ పార్టీ కార్యకర్తలకు నియామకాలు కల్పించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గుర్తించిందని దూబే ఆరోపించారు. న్యాయపరమైన ప్రవర్తనా నియమాలను కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు న్యాయవ్యవస్థను పార్టీ కార్యాలయంగా మార్చారని, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ ఇష్టానుసారంగా న్యాయమూర్తుల బదిలీలు చేపట్టాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ నియామకాలన్నింటినీ రద్దు చేసిందని తెలిపారు.
అనంతరం గాంధీ కుటుంబం హడావుడిగా రాజ్యాంగంలోని 20వ సవరణను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పారదర్శకంగా, నిజాయతీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తోందని ప్రశ్నించే రాహుల్ గాంధీ, విపక్ష పార్టీలకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. న్యాయవ్యవస్థలోకి పార్టీ కార్యకర్తలకు బానిసల మాదిరిగా ఉద్యోగాలు ఎలా కల్పించారు? హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పులు ఎలా వచ్చాయి? సుప్రీంకోర్టు ఆదేశాన్ని పార్లమెంట్లో తిరగరాసిన పాపం ఎవరిది? బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం ఎప్పుడు హత్య చేసింది? అంటూ నిషికాంత్ దూబే ప్రశ్నించారు.
Also Read:EPFO New Rules:ఈపీఎఫ్ విత్డ్రా..కొత్త రూల్స్

