బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో డిక్టేటర్స్ మధ్య పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా త్రిగుణ్, ముకేష్ మధ్య ఆధిపత్య పోరు ఇంట్లో కొత్త వివాదాలకు దారితీస్తోంది. అయితే గురువారం ప్రసారమైన 75వ ఎపిసోడ్లో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌లో త్రిగుణ్ టీం వెనుకబడటంతో పోటీని రద్దు చేయడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎపిసోడ్ ప్రారంభంలోనే లైటర్ విషయంలో రెండు టీమ్‌ల మధ్య గొడవ మొదలైంది. త్రిగుణ్ లైటర్ దాచిపెట్టి ముకేష్ టీంకు ఇబ్బందులు సృష్టించగా, ప్రతీకారంగా ముకేష్ టీం కిచెన్‌లోని లైటర్లు, ఇతర వస్తువులను దాచేసింది. అనంతరం రామకృష్ణను త్రిగుణ్ తన టీం ఆధీనంలోకి తీసుకుని, అందరూ ‘త్రిగుణ్ అన్న దూత’ అని నినాదం చేయాలని షరతు పెట్టాడు. అందుకు రామకృష్ణ, ముకేష్ టీం సభ్యులు అంగీకరించలేదు. చివరకు చలిలో బయట పడుకున్నా సరే ఆ నినాదం చేయబోమని ముకేష్ స్పష్టం చేశాడు.
మరుసటి రోజు కిచెన్ ఆధిపత్యం కోసం బిగ్ బాస్ ‘పరుగులు-ప్రశ్నలు’ టాస్క్ ఇచ్చారు. త్రిగుణ్ టీం నుంచి వంశీ, ముకేష్ టీం నుంచి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ పోటీలో ముకేష్ టీం 8 స్లైడ్స్ ఏర్పాటు చేయగా, త్రిగుణ్ టీం 6 స్లైడ్స్ మాత్రమే పెట్టింది. అయితే సంచాలకులు శివ, వర్షిణి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయాన్ని డిక్టేటర్స్కు అప్పగించారు. అక్కడ కూడా వివాదం కొనసాగడంతో చివరకు బిగ్ బాస్ టాస్క్‌ను రద్దు చేశారు. త్రిగుణ్ టీం వెనుకబడిన సమయంలోనే పోటీ రద్దు కావడం పక్షపాత ఆరోపణలకు కారణమైంది.
Also Read:EPFO New Rules:ఈపీఎఫ్ విత్‌డ్రా..కొత్త రూల్స్
మరోవైపు డిక్టేటర్స్కు మాత్రమే ప్రత్యేకంగా ఫుడ్ పంపించినా త్రిగుణ్ తన వాటాను ఫాలోవర్స్‌కు పంచడం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన టీం సభ్యులు తిన్న తర్వాతే తింటానని చెప్పి మంచి మనసు చాటుకున్నాడు. అనంతరం స్వైప్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకుని నీతూ మాస్టర్ స్థానంలో అమన్‌ను ఎంపిక చేశాడు. మొత్తానికి వివాదాలు, వ్యూహాలు, టాస్కులతో 75వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా టాస్క్ రద్దు నిర్ణయం మాత్రం బిగ్ బాస్ తీరుపై మరోసారి చర్చకు తెరలేపింది.

