EPFO New Rules:ఈపీఎఫ్‌ విత్‌డ్రా..కొత్త రూల్స్

2
- Advertisement -

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో కీలకమైన మార్పును తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగ విరమణ సమయంలో పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. ఇకపై నెలవారీగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)ను ప్రతిపాదించింది.

ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగ విరమణ తర్వాత కూడా తమ పీఎఫ్ పొదుపులను EPF ఖాతాలోనే కొనసాగించవచ్చు. అలాగే మిగిలిన మొత్తంపై వడ్డీ పొందుతూనే అవసరానికి అనుగుణంగా నెలవారీ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన EPFO సభ్యులు తమ ఖాతాలో జమ అయిన 100 శాతం EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద నెలవారీ పెన్షన్ పొందేందుకు అర్హులు.

అయితే ప్రతిపాదిత కొత్త విధానంలో ఉద్యోగులకు పలు రకాల విత్‌డ్రాయల్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం డబ్బును క్రమంగా విత్‌డ్రా చేసుకోవడం, కొంత మొత్తాన్ని ఒకేసారి తీసుకుని మిగిలిన డబ్బును నెలవారీగా పొందడం, కేవలం వడ్డీ మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకునే విధానాలు ఇందులో ఉండనున్నాయి.

Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 55 ఏళ్లు పైబడిన సుమారు 6.32 లక్షల మంది EPF ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. వీరి ఖాతాల్లో రూ.5 లక్షలకు పైగా ప్రావిడెంట్ ఫండ్ నిల్వలు ఉన్నట్లు EPFO అంతర్గత అంచనాలు వెల్లడిస్తున్నాయి.కొత్త విధానంలో విత్‌డ్రా చేయని మిగిలిన మొత్తం EPF ఫండ్‌లోనే పెట్టుబడిగా కొనసాగుతుంది. దానిపై ప్రస్తుతం వర్తించే EPF వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా నిర్ణయించిన వ్యవధి వరకు నెలవారీగా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మధ్యలోనే ఈ విధానాన్ని నిలిపివేయాలనుకుంటే SWPను రద్దు చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఎప్పుడైనా ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

- Advertisement -