దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన 15 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన.. తన బెస్ట్ వర్క్ ఇంకా రావాల్సి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనిరుధ్ తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
సంగీత దర్శకుడిగా అనిరుధ్ తన ప్రయాణాన్ని 2012లో విడుదలైన తమిళ చిత్రం ‘3’తో ప్రారంభించారు. ఈ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలి సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
ధనుష్, రజనీకాంత్, విజయ్, అజిత్, కమల్ హాసన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. జైలర్ , విక్రమ్ , మాస్టర్ , జవాన్ , లియో , దేవర వంటి చిత్రాల్లో ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయన ఇచ్చే పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
తన 15 ఏళ్ల సంగీత ప్రయాణంపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనిరుధ్.. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, సంగీత ప్రియులకు కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే తన ఉత్తమ సంగీతం ఇంకా రావాల్సి ఉందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేననే సందేశాన్ని ఇచ్చారు. దీంతో ఆయన రాబోయే సినిమాల్లో ఎలాంటి సంగీత ప్రయోగాలు చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.


