తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా ఖండించింది. నిమ్స్ ఆసుపత్రి పెన్షన్ నిధుల నుంచి హరీశ్ రావు రూ.25 కోట్లు తీసుకున్నారంటూ కవిత మాట్లాడటం పూర్తిగా తప్పని మండిపడ్డారు. తమ కుటుంబ వివాదాల్లోకి నిమ్స్ సిబ్బందిని లాగవద్దని హితవు పలికారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తమ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిమ్స్ ఆసుపత్రిలో పెన్షన్ ఫండ్స్ కింద ఉన్న మొత్తం రూ.26 కోట్లు మాత్రమేనని సిబ్బంది పేర్కొన్నారు. అలాంటప్పుడు హరీశ్ రావు రూ.25 కోట్లు తీసుకున్నారంటూ కవిత ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవద్దని కవితకు సూచించారు. మీ కుటుంబంలోని గొడవల్లోకి తమను లాగవద్దని స్పష్టం చేశారు.
పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కవితకు ఎవరు లేఖ రాశారో వెల్లడిస్తే విచారణ జరిపిస్తామని నిమ్స్ సిబ్బంది తెలిపారు. ఆ లేఖ రాసిన వ్యక్తుల వివరాలు ఇస్తే వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖను ఆధారంగా చేసుకుని హరీశ్ రావుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
కవిత తమకు న్యాయం చేయాల్సింది పోయి రూ.100 కోట్లు ఇచ్చామని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని నిమ్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తాము రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.100 కోట్లు ఇచ్చేంత ఆర్థిక స్థోమత తమకు ఉందా? అని ప్రశ్నించారు.
తమ సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు, అనవసర ఆరోపణలతో తమను వివాదాల్లోకి లాగడం సరికాదని అన్నారు. రాజకీయ, కుటుంబ వివాదాలకు నిమ్స్ ఆసుపత్రి సిబ్బందిని దూరంగా ఉంచాలని కోరారు. తమ పెన్షన్ నిధులు, ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కవితకు సూచించారు.

