చందనోత్సవం..కొండగట్టు ముస్తాబు

1
- Advertisement -

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలో చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు సిద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాల అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.

నవంబర్ 15 నుంచి ఆరు రోజుల పాటు చందనోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నవంబర్ 20న ఉదయం 9.57 గంటలకు మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. గత 60 ఏళ్లుగా ఆంజనేయస్వామి మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనాన్ని సంప్రదాయ పద్ధతుల్లో తొలగించనున్నారు. ఇందుకోసం బంగారు, వెండి పరికరాలతో పాటు మామిడి, తెల్లమద్ది, మర్రి, రావి తదితర చెట్ల కలపతో తయారు చేసిన ప్రత్యేక పరికరాలను ఉపయోగించనున్నారు.

చందనం తొలగించిన అనంతరం స్వామివారి విగ్రహానికి నువ్వుల నూనెతో అభ్యంగనం నిర్వహిస్తారు. ఆ తర్వాత కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి నదుల జలాలతో పాటు సముద్ర జలాలతో అభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోమాలు, జపాలు, పారాయణాలు నిర్వహించనున్నారు.

చందనోత్సవం జరిగే సమయంలో భక్తులకు మూలవిరాట్ దర్శనం నిలిపివేయనున్నారు. నవంబర్ 20న మహాసంప్రోక్షణ పూర్తయిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం వరుసగా 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆరు దశాబ్దాల తర్వాత లభిస్తున్న ఈ అరుదైన అవకాశంపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

ALso Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే!

చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో సుమారు రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయం, యాగశాలకు రంగులు వేయడంతో పాటు ఆలయంపై సుదర్శన చక్రం ఏర్పాటు, ప్రధాన గోపురంపై కలశాల ప్రతిష్ఠ వంటి పనులు చేస్తున్నారు. గోపురాలపైకి అర్చకులు వెళ్లేందుకు తాత్కాలిక పందిళ్లు, చెక్క మెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -