తెలంగాణలో రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన రైతు గర్జన సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలను తరలించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. వట్టిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసింది కేసీఆరేనని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంలో శివుడి పాదాల దగ్గర ఉన్న నీటిని శ్రీరాముడి శిరస్సు వరకు తీసుకొచ్చిన భగీరథుడు కేసీఆర్ అని అభివర్ణించారు. గతంలో పూడుకుపోయి, తుమ్మ చెట్లు మొలిచిన శ్రీరాంసాగర్ కాలువల్లో కాళేశ్వరం జలాలను పారించి, ఆయకట్టులో చివరి మడి వరకు నీటిని అందించినట్లు గుర్తుచేశారు.
గోదావరి నది ఒడ్డున ఉన్న నిర్మల్ జిల్లాలో తొమ్మిది కరువు మండలాలు ఉండటం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసే సదుపాయాలు ఉన్నప్పటికీ పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కరువు పరిస్థితులు తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి తన గడ్డం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని విమర్శించారు.
ప్రపంచంలో ఎవరైనా రేవంత్ రెడ్డి లెక్క మారాలని అనుకుంటారా? అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరు చూసిన తర్వాత కూడా బుద్ధి ఉన్నవారు ఆయనలా మారాలని కోరుకోరని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
నిర్మల్ జిల్లాకు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి చారిత్రక సంబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. 1997లో మంత్రిగా ఉన్న సమయంలో పోచంపాడు రిజర్వాయర్‌ను సందర్శించిన కేసీఆర్.. అక్కడి పరిస్థితులను చూసి ఆవేదనకు గురయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తానే శ్రీకారం చుడతానని అప్పుడే నిర్ణయించుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:క్రియేటర్ల కోసం అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్!
రైతు గర్జన సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రైతులకు నీటి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

