ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిద్ర, ఆహారం, ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపించడం లేదు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే పనులకు వెళ్లడం, గంటల తరబడి మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గడపడం సాధారణంగా మారిపోయింది. పని ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లు శరీర ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చర్మం నిస్తేజంగా మారడం, మొటిమలు రావడం, పొడిబారడం, సున్నితంగా మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
చాలామంది ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే కొత్త స్కిన్ కేర్ ఉత్పత్తుల కోసం వెతుకుతుంటారు. కొత్త సీరమ్‌లు, క్రీమ్‌లు ఉపయోగించడం, స్కిన్ కేర్ రొటీన్ మార్చుకోవడం చేస్తుంటారు. అయితే ప్రతి చర్మ సమస్యకు కారణం బయట ఉపయోగించే ఉత్పత్తులే కాకపోవచ్చు. మన రోజువారీ జీవనశైలి కూడా చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చాలామందికి చర్మ సంరక్షణపై అవగాహన పెరిగింది. ఏ ఉత్పత్తుల్లో ఎలాంటి పదార్థాలు ఉంటాయి? సన్‌స్క్రీన్ ఎందుకు ఉపయోగించాలి? ఏ రకమైన చర్మానికి ఎలాంటి ఉత్పత్తులు సరిపోతాయి? వంటి విషయాలపై అవగాహన కలిగి ఉంటున్నారు. అయినప్పటికీ చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు.
దీనికి ఒక కారణం మన జీవనశైలి కావచ్చు. సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి అంశాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు ఉద్యోగం చేసే వ్యక్తులు ఉదయం నిద్రలేవగానే ఈమెయిల్స్ చెక్ చేయడం, రోజంతా కంప్యూటర్ ముందు పనిచేయడం, భోజనం మానేయడం, ఎక్కువగా కాఫీ తాగడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు చర్మం సహజంగా కోలుకునే ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చు.
ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల చర్మం పొడిబారడం, సున్నితంగా మారడం, మొటిమలు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల చర్మ సంరక్షణకు బయట ఉపయోగించే ఉత్పత్తులతో పాటు శరీర అంతర్గత ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి.ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందుగా మన రోజువారీ అలవాట్లను పరిశీలించుకోవాలి. తగినంత నిద్రపోతున్నామా? పని మధ్యలో విరామం తీసుకుంటున్నామా? సమయానికి పోషకాహారం తీసుకుంటున్నామా? మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయిస్తున్నామా? అనే విషయాలపై దృష్టి పెట్టాలి.
Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!
వీటితో పాటు చర్మ సంరక్షణలో కొన్ని ప్రాథమిక అలవాట్లు పాటించాలి. చర్మానికి సరిపోయే మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి. తరచూ కొత్త ఉత్పత్తులు ప్రయత్నించడం కంటే ఒక సరైన స్కిన్ కేర్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటించడం మంచిది.
మొత్తంగా చూస్తే చర్మ ఆరోగ్యం అనేది అద్దం ముందు చేసుకునే సంరక్షణతోనే ముగిసిపోయేది కాదు. మన నిద్ర, ఆహారం, ఒత్తిడి, జీవనశైలి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మంలో కనిపించే మార్పులు మాత్రమే బర్న్అవుట్కు నిర్ధారణ కాదు. అయితే అవి మన జీవనశైలిని మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయవచ్చు.

