న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులతో రాణించడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వర్షం కారణంగా రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడటంతో భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా 22.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన గత 12 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2019 జనవరిలో భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఓటమి చవిచూసింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మేఘావృతమైన వాతావరణంలో భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. షార్ట్ పిచ్ బంతులతో కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read:బీజేపీకి తిరుగులేదు.. రాహుల్‌పై సెటైర్లు!
అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గర్నూర్ బ్రార్ మూడు వికెట్లు తీశాడు. అన్షుల్ కాంబోజ్ 10 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చివరి వికెట్‌కు బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ 39 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ స్కోరు 185కు చేరింది.

