ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌ను నియంత్రించే దిశగా భారతీయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు మెదడులో వచ్చే అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే రెండు కొత్త రసాయన సమ్మేళనాలను అభివృద్ధి చేశారు. సాధారణంగా ఉపయోగించే కీమోథెరపీ ఔషధాలకు సైతం లొంగని ఈ క్యాన్సర్‌పై కొత్త చికిత్సా విధానానికి వీరి పరిశోధన మార్గం చూపుతోంది.
పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ రెండు సమ్మేళనాలు కణ విభజనను నియంత్రించే టిటికె (TTK లేదా Mps1) అనే ప్రోటీన్ కార్యకలాపాలను అడ్డుకుంటాయని వెల్లడించారు. క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే వేగంగా విభజించుకుంటూ పెరుగుతాయి. ఈ ప్రక్రియలో టిటికె ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ తీవ్రత పెరగడానికి కూడా ఈ ప్రోటీన్ అధిక స్థాయిలో ఉండటం ఒక కారణమని గత పరిశోధనలు సూచించాయి.
SPK17, SPK17b అనే రెండు సమ్మేళనాలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి టిటికె ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఈ రెండు సమ్మేళనాలు సాధారణ కీమోథెరపీ ఔషధమైన టెమోజొలోమైడ్ (TMZ) కంటే మెరుగైన ప్రభావాన్ని చూపినట్లు ప్రయోగశాల అధ్యయనాల్లో గుర్తించారు.
SPK17 సమ్మేళనం క్యాన్సర్ కణాల్లో దెబ్బతిన్న డీఎన్ఏను మరమ్మతు చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో డీఎన్ఏ నష్టం పేరుకుపోయి చివరకు క్యాన్సర్ కణాలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరో సమ్మేళనం SPK17b క్యాన్సర్ కణాల్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ROS) అనే హానికర పదార్థాల స్థాయిని పెంచుతుంది. ఇవి కణాల రక్షణ వ్యవస్థను దెబ్బతీసి వాటి మరణానికి దారితీస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలంలోకి వ్యాపించే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధకులు గుర్తించారు.
ALso Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న
ప్రస్తుతం ఈ సమ్మేళనాలు జంతువులపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాటి సమర్థత, భద్రతను మరింత సంక్లిష్టమైన జీవ వ్యవస్థల్లో పరీక్షించాల్సి ఉంది. ఈ పరీక్షలు విజయవంతమైతే భవిష్యత్తులో మెదడు క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉన్నాయని, మనుషులపై చికిత్సకు అందుబాటులోకి వచ్చాయని భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

