ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు కీలక మార్పులు చేపడుతోంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ను నియమించిన ఫ్రాంచైజీ తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు మరో కీలక బాధ్యత అప్పగించింది. అతడిని జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది.
రాబిన్ ఉతప్పకు ఐపీఎల్లో కోచ్‌గా పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అతడు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు కోచ్‌గా అదే జట్టులోకి తిరిగి రావడం విశేషం. భారత జట్టు 2007లో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉతప్ప సభ్యుడిగా ఉన్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ అతడికి మంచి అనుభవం ఉంది. యువ ఆటగాళ్ల బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం, టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడంలో ఉతప్ప కీలక పాత్ర పోషించనున్నాడు.
ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ బృందంలో మరికొందరికి కూడా బాధ్యతలు అప్పగించింది. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్క్లెనగన్ను బౌలింగ్ కోచ్‌గా, టీ దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. భారత మాజీ పేసర్ ధవల్ కులకర్ణికి డెవలప్మెంట్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఇచ్చింది.
Also Read:సోనియా గాంధీకి CTI లేఖ
ఇక హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ నాయకత్వంలో ఈ కొత్త కోచింగ్ బృందం ఐపీఎల్ 2027 కోసం జట్టును సిద్ధం చేయనుంది. వరుస మార్పులతో ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో మళ్లీ టైటిల్ పోటీలో నిలవాలని భావిస్తోంది.

