తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో గ్రీన్ ఎస్ఎం క్యాబ్ సర్వీసుల ఏర్పాటుపై ఆటో డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమ ఆదాయం తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు కొత్త క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వస్తే తమ ఉపాధి మరింత దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని డ్రైవర్లు మండిపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త క్యాబ్ సర్వీసులకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల తమ జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో రేపు జరగనున్న గ్రీన్ ఎస్ఎం కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. కొత్త క్యాబ్ సర్వీసుల వల్ల ఆటో డ్రైవర్లకు కలిగే నష్టాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:నెట్ఫ్లిక్స్ కోసం చిరు ‘మెగావర్స్’
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, వారి ఉపాధికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

