జైరాం చిల్లర రాజకీయాలు మానుకో…

220
Ktr Blasts jairam Ramesh
- Advertisement -

కాంగ్రెస్ నేతలకు భవిష్యత్‌పై భయం పట్టుకుని… ప్రతీ ఇష్యూను  రాజకీయం చేస్తున్నారని  మండిపడ్డారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ ఆరోపణలను తిప్పికొట్టారు.  జైరాం రమేష్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జైరాం రమేష్ తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని లేకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్‌ శాఖను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఖరారు చేసిన ధరలకే పోలీస్ వాహనాలను కొనుగోలు చేశామని…ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. డీజీఎస్‌ఎన్‌డీ ప్రకారమే వాహనాల కొనుగోలు జరిగిందన్నారు.

జైరాం రమేష్ పెద్ద మేధావినని చెప్పుకుంటుంటారని… ఆయన ఏం మేధావో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. తనపై కావాలనే జైరాం రమేష్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  వెంకయ్యనాయుడి కుమారుడు, కేసీఆర్ కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూంల నుంచి భారీ ఎత్తున వాహనాలను కొనుగోలు చేశారంటూ జైరాం ఆరోపించారని… పోలీస్ డిపార్ట్ మెంట్ కోసం కొన్న వాహనాలను షోరూంల నుంచి కొనుగోలు చేయలేదని, డైరెక్ట్ గా టయోటా కంపెనీ నుంచే కొనుగోలు చేశామని చెప్పారు. ఒక్క టయోటా వాహనాలనే కాకుండా టాటా సుమోలు, మహీంద్రా బొలెరోలు, మారుతి స్విఫ్ట్ డిజైర్, ఐషర్ బస్సులు, తదితర వాహనాలను కూడా కొన్నామని తెలిపారు.

తనకు వాహనాల కొనుగోలుకు సంబంధించి ఏ కంపెనీలో భాగస్వామ్యం లేదని….ఆధారాలుంటే చూపాలని వారికే రాసిస్తానని కేటీఆర్ వెల్లడించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని….ప్రజా సమస్యల పరిష్కారంలో సీఎం తక్షణ చొరవ చూపుతున్నారని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయని….సిరిసిల్ల ఘటనపై ఉత్తమ్ అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఉత్తమ్, జానా మంత్రులుగా ఉన్నప్పుడు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ఆరోపించారు. దళితుల సంక్షేమం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా రూ.76 కోట్ల ఆదాయం వస్తే….తెలంగాణ వచ్చాక రూ. 434 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

- Advertisement -