రైళ్లలోఇకపై రాత్రి ఛార్జింగ్‌ బంద్‌!

2
- Advertisement -

రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల వినియోగంపై రైల్వే శాఖ మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రైళ్లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లను ఆదేశించింది. ఇటీవల ముంబై లోకల్ రైలులో ఛార్జింగ్ పెట్టిన పవర్ బ్యాంక్ పేలిన ఘటన నేపథ్యంలో ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

దాదర్ నుంచి బద్లాపూర్ వైపు వెళ్తున్న లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడు ఛార్జింగ్ పెట్టిన పవర్ బ్యాంక్ పేలినట్లు సమాచారం. దీంతో రైలు బోగీలో దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు జారీ చేసిన లేఖలో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. నిర్ణీత సమయాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఆపివేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొంది.

అన్ని రైల్వే జోన్ల అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి ఈ నిబంధనపై అవగాహన కల్పించాలని రైల్వే బోర్డు సూచించింది. రైళ్లలోని ప్రతి బోగీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లు నిలిపివేస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధన 2014 జూన్ 19 నుంచి అమల్లో ఉంది. బెంగళూరు–హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత రైల్వే భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చిలోనూ రైల్వే శాఖ ఈ నిబంధన అమలుపై మరోసారి దృష్టి సారించింది. ఆ ఏడాది మార్చి 16 నుంచి పశ్చిమ రైల్వే పరిధిలో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ప్రారంభించారు.

Also Read:ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్‌ పంజా..

తాజా ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిబంధనను మరోసారి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రిపూట ప్రయాణించేవారు తమ మొబైల్ ఫోన్లు, ఇతర అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే ఛార్జింగ్ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -