పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ శుక్రవారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. భారత్, పోలాండ్ మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై వారు చర్చించారు. ముఖ్యంగా వ్యాపారం, పెట్టుబడులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు.
భారత్ పర్యటనలో భాగంగా డొనాల్డ్ టస్క్ తన ప్రతినిధి బృందంతో కలిసి గురువారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక ప్రభుత్వ తరఫున మంత్రి కృష్ణ బైరేగౌడ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ టస్క్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వాణిజ్య సంబంధాలను విస్తరించడం, రక్షణ, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు చర్చించారు.
Also Read:పాలమూరుకు కరువు..రేవంత్ వైఫల్యమే
బెంగళూరులో భారత్-పోలాండ్ వ్యాపార సదస్సులోనూ టస్క్ పాల్గొననున్నారు. ఐటీ, అంతరిక్ష రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులతో సమావేశమై కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించనున్నారు. భారత్-పోలాండ్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెంచేందుకు ఈ పర్యటన కీలకంగా మారనుంది.

