అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ టెహ్రాన్ కీలక ప్రకటన చేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేశాలకు అప్పగించబోమని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ విషయాన్ని వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
శుద్ధి చేసిన యురేనియం తమ దేశానికి చెందిన జాతీయ సంపద అని, దేశీయ అవసరాల కోసమే దానిని వినియోగిస్తామని రెజాయీ స్పష్టం చేశారు. అణు పదార్థాల్లో కొంత భాగాన్ని కూడా ఇరాన్ నుంచి బయటకు తరలించేందుకు అంగీకరించబోమని పేర్కొన్నారు. అమెరికా తమపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తర్వాతే చర్చలకు ముందుకు వస్తామని వెల్లడించారు.
Also Read:రామాయణం..విజనరీ మూవీ
ఇరాన్ అణ్వాయుధ శక్తిగా ఎదగకుండా అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. మరోవైపు, తమ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయాలన్న అమెరికా ప్రయత్నాలను ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ముగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అసిమ్ మునీర్ తాజా ఇరాన్ పర్యటన కూడా శాంతి ప్రయత్నాల్లో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ ఇటీవల స్పందిస్తూ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీశామని కూడా ఆయన ప్రకటించారు.

