భారత్‌ అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్‌ పొరపాటు!

1
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఎన్నికల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల్లో పొరపాటుకు గురయ్యారు. బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలపై స్పందిస్తూ.. భారత్‌, బ్రెజిల్‌ దేశాలను గందరగోళానికి గురిచేసినట్లు కనిపించారు. తొలుత తన ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లో బ్రెజిల్‌కు బదులుగా భారత్‌ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావించారు. భారత్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశలో ఈరోజు 125 మిలియన్ల మంది ఓటు వేశారు. పోలింగ్‌ ముగిసిన కొద్దిసేపటికే అదే రోజు ఫలితాలు వెలువడ్డాయి” అని ట్రంప్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

అయితే భారత్‌లో అధ్యక్షుడిని దేశవ్యాప్తంగా ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకునే విధానం లేదు. అంతేకాకుండా ఇటీవల భారత్‌లో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగలేదు. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలు తప్పుగా ఉన్నట్లు స్పష్టమైంది. అనంతరం ఆయన తన పోస్టును సవరించి.. ‘ఇండియా’ స్థానంలో ‘బ్రెజిల్‌’ అని మార్చారు. అయితే అమెరికా ఎన్నికల వ్యవస్థపై చేసిన విమర్శలను మాత్రం కొనసాగించారు.

అమెరికాలో ఎన్నికల ఫలితాల వెల్లడికి ఎక్కువ సమయం పడుతోందని ట్రంప్‌ విమర్శించారు. డెట్రాయిట్‌, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నప్పటికీ ఫలితాలు వెల్లడించడానికి వారాలు పడుతున్నాయని పేర్కొంటూ.. అమెరికా ఓటింగ్‌ వ్యవస్థ అవినీతిమయంగా ఉందని ఆరోపించారు.భారత్‌లో రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. పార్లమెంట్‌లోని రెండు సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. అనుపాత ప్రాతినిధ్య విధానంలో సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓట్‌ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది.

Also Read:ఎన్నారై బీఆర్ఎస్ యూకే..విస్తృత సమావేశం

సాధారణ ఎన్నికల్లో మాత్రం ప్రజలు లోక్‌సభ సభ్యులను, రాష్ట్రాల శాసనసభ సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు. అనంతరం లోక్‌సభలో మెజార్టీ సాధించిన పార్టీ లేదా కూటమి నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు.ఇదిలా ఉండగా.. గతంలో ట్రంప్‌ భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసలు కూడా చేశారు. ముఖ్యంగా ఓటర్‌ ఐడీ విధానాన్ని ఉదాహరణగా చూపుతూ అమెరికాలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని అన్నారు.

ఆగస్టు 17న చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టులో.. భారత్‌లో ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలోనూ ఇదే తరహా నిబంధనలు తీసుకురావాలని కోరుతూ ‘SAVE America Act’కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో దాదాపు 98 కోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.

- Advertisement -