ఫ్లై దుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించి 174 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం కలిశారు. స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్యం, బాధ్యతాయుత వైఖరిని యువరాజు ప్రశంసించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి కూడా అయిన షేక్ హమ్దాన్.. 39 ఏళ్ల కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో సమావేశమైన ఫొటోలను సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. దేశ నాయకత్వం మొత్తం ఆయన ధైర్యాన్ని, సేవాభావాన్ని అభినందిస్తోందని తెలిపారు.
“కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కలిశాను. ధైర్యం, బాధ్యత, మానవ ప్రాణాల పట్ల శ్రద్ధకు ఆయన అత్యున్నత ఉదాహరణగా నిలిచారు. ఆయన మా బృందంలో భాగం కావడం, మా దేశ చరిత్రలో ఒక భాగంగా నిలవడం, యూఏఈ ప్రాతినిధ్యం వహించే విలువల్లో భాగం కావడం మాకు గర్వకారణం. యూఏఈ అంటే కరుణ, శాంతి, జీవితం” అని షేక్ హమ్దాన్ పేర్కొన్నారు.
ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో స్మిత్ మచ్చర్ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విమానంలో ఉన్న ఆయన సహ పైలట్, ఒమన్‌కు చెందిన హమ్మామ్ అల్-హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ‘అల్ అరేబియా ఇంగ్లిష్’ కథనం పేర్కొంది.
ఈ ఘటనలో స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడినప్పటికీ.. పరిస్థితులను అదుపులోకి తీసుకుని విమానాన్ని కూల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కథనం తెలిపింది. ఆయన సమయస్ఫూర్తి, ధైర్యంతో విమానంలోని 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడినట్లు సమాచారం.
ఈ సాహసోపేత చర్యపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్మిత్ మచ్చర్‌ను అభినందించారు. మోదీ ఆయనతో పాటు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు కథనంలో పేర్కొన్నారు. స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలకు గుర్తింపుగా దేశ అత్యున్నత శాంతికాల వీర పురస్కారం ‘అశోక చక్ర’ ఇవ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) కూడా ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాసింది.
స్మిత్ మచ్చర్ ఇద్దరు పిల్లల తండ్రి. విమాన కాక్‌పిట్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ పైలట్‌గా తన బాధ్యతలను కొనసాగించారని FIP అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రంధావా లేఖలో పేర్కొన్నారు. ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, విధి పట్ల అంకితభావాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తిస్తే తమకు గౌరవంగా ఉంటుందని FIP తెలిపింది.
Also Read:ఆప్‌కు షాక్..కాంగ్రెస్‌లోకి ప్రియాంక

