మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హీరో తరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచీ మీడియా తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని, ఈ మధ్య కాలంలో మాత్రం తనపై కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని , అలాంటి వార్తల్లో నిజంలేదంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారాయన. గతంలో తానేదో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని, తన తల్లి స్నేహితురాలి కుమార్తెతో తన వివాహం కుదిరిపోయిందని, తాను నెలలో 15 రోజులు గోవాలో ఉంటానని, తనకు బినామీ పేర్లతో పబ్ లలో వాటాలు ఉన్నాయని… ఇలా రకరకాల ప్రచారాలు తనపై జరిగాయని అన్నాడు. దుష్ప్రచారాల వల్ల తనకూ, తన కుటుంబ సభ్యులకు చాలా బాధగా ఉందన్నారు.
మీడియాలో వచ్చే ఇలాంటి పుకార్లు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఎవరైనా, ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించాడు. మీడియాలో వచ్చే రోజుకొక వార్తతో తన కుటుంబం చాలా క్షోభపడుతోందని, దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపాలని కోరాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని, చట్టంపైన, అకున్ సబర్వాల్ పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని, తానేతప్పు చేయలేదని స్పష్టం చేశాడు. తానేనాడు చట్టపరిధిని దాటి వ్యవహరించలేదని అన్నాడు. సిట్ అధికారుల అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పానని, తాను చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారని, డ్రగ్స్‌ను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన చెప్పారు.