అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

4
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జాతీయ స్థాయిలో పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులతో కూడిన బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీ చేరుకుంది. రేపు జాతీయ మహిళా కమిషన్ (NCW), జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను కలిసి అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని నేతలు నిర్ణయించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునే క్రమంలో పోలీసులు తమపై బలప్రయోగం చేశారని పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగడంతో పాటు ఆమెను కిందపడేలా చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇతర ఆధారాలను ఇప్పటికే తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సమర్పించినట్లు పార్టీ తెలిపింది. మహిళా ఎమ్మెల్యేలు సబితా, సునీతా, కోవ లక్ష్మి కూడా తమను పురుష పోలీసులు దురుసుగా నెట్టివేశారని బహిరంగంగా తెలిపారు.

ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం సెప్టెంబర్ 9న గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. న్యాయం జరగకపోతే ఢిల్లీ వెళ్లి National Commission for Womenతో పాటు National Human Rights Commissionను ఆశ్రయిస్తామని కేటీఆర్ అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనకు కొనసాగింపుగా బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:అక్టోబర్‌ 9న థియేటర్స్‌లోకి ‘అ’

రేపటి ఫిర్యాదులో ప్రధానంగా మహిళా ప్రజాప్రతినిధులపై పురుష పోలీసుల బలప్రయోగం, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, ప్రజాప్రతినిధుల హక్కులు–మహిళల గౌరవానికి భంగం కలిగించారనే అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. వీడియోలు, ఫొటోలు, వైద్య సంబంధిత వివరాలు, పోలీసులకు చేసిన ఫిర్యాదులు తదితర ఆధారాలను కూడా కమిషన్లకు అందించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ సమర్పించిన గవర్నర్ వినతిపత్రంలో జగదీశ్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని కూడా పేర్కొంది.

- Advertisement -