ప్రజా సమస్యలపై చర్చ ఏదీ?:హరీష్

3
- Advertisement -

రాష్ట్రంలో ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “డైవర్షన్ పాలిటిక్స్” (దృష్టి మళ్లింపు రాజకీయాలు) చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో మూడు రోజులుగా అసలు ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండా ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును కాకుండా, సామాన్య ప్రజల గొంతును నొక్కుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. 22A భూముల అంశం, ఉద్యోగుల సమస్యలు, రైతుల గోస, నిరుద్యోగుల ఆందోళనలు, విద్యార్థుల సమస్యలపై చర్చ జరగకుండా తప్పించుకుంటున్నారు…డైవర్షన్ పాలిటిక్స్ కాదు కావాల్సింది.. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి…మూడు రోజుల నుంచి ఒక్క ప్రధాన ప్రజా సమస్యపైనా సభలో చర్చ జరగకపోవడం శోచనీయం అన్నారు.

కాంగ్రెస్ పార్టీయే నడుపుతున్న ఒక ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌లోని పోస్టులను పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి దిగజారారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఆ ఫేక్ అకౌంట్‌లో పోస్టులు పెడుతున్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటు. ఆ దొంగ ఫేక్ అకౌంట్‌పై ఈరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read:రణ్‌వీర్-దీపికా..స్పెషల్ షూట్

ఫేక్ అకౌంట్ వివరాల ఆధారంగా సభను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి బేషరతుగా ప్రజలకు, సభకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -