ప్రశ్నిస్తారన్న భయంతోనే సస్పెన్షన్!

3
- Advertisement -

తెలంగాణ శాసనసభ నుండి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను శాసనసభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ట నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబడతారన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దారుణమైన నిర్ణయానికి ఒడిగట్టిందని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ నిరసిస్తూ ఆయన ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై తమ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వం వణికిపోతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలకు జవాబు చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

డైవర్షన్ గేమ్‌లు: గడిచిన రెండు రోజులుగా రకరకాల అంశాలతో డైవర్షన్ రాజకీయం ఆడిన ప్రభుత్వం, ఇక ముందు అది సాధ్యం కాదని గ్రహించే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కూడా పూర్తి కాకముందే అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారాన్ని, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేదని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా, శాసనసభకు రానివ్వకపోయినా వెనకడుగు వేసేది లేదని, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల నెరవేర్పులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతిపక్ష సభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత గర్హనీయమని ఆయన పేర్కొన్నారు.

Also Read: హెర్బల్ డిటాక్స్‌తో కిడ్నీలకు హాని?

- Advertisement -