దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌

4
- Advertisement -

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF), ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నిర్వాహకులు ఆహ్వానించారు.

GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసింది. తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని వారు కేటీఆర్‌ను ప్రత్యేకంగా కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు, అక్కడి తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు GTF ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

అక్టోబర్ 11న దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం ETCA ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మరో బతుకమ్మ వేడుక జరగనుంది. రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని మహేష్ బిగాల తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ బిగాల ఆధ్వర్యంలో దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. బతుకమ్మను కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని, గల్ఫ్ దేశాల్లోనూ ఈ పండుగకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.

ప్రవాస తెలంగాణ సమాజం తమ స్వస్థలాలతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగించేందుకు బతుకమ్మ వేడుకలు ఒక వేదికగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Also Read:ఫన్ రైడ్‌లా..‘కామ్రేడ్ కళ్యాణ్’!

కేటీఆర్ దుబాయ్ బతుకమ్మ వేడుకలకు హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి పండుగలో పాల్గొంటే తమకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని GTF ప్రతినిధులు తెలిపారు. గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో కేటీఆర్‌కు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయన పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్‌తో పాటు జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -