సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ 1000 రోజుల ద్రోహపూరిత పాలనను నిరసిస్తూ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన 8 రోజుల నిరసన కార్యక్రమం లో భాగంగా రెండవ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని కౌడిపల్లి మండల కేంద్రం లో నర్సాపూర్ MLA సునీతా లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నా లో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు మాజీ మంత్రి, శాసన సభ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. కుట్రలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితం అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.వంద రోజుల బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయి? ఏ వర్గానికీ న్యాయం జరగలేదు…రైతుబీమా బంద్.. రైతుబంధు ఎగ్గొట్టి రూ.29 వేల కోట్లు లూటీ చేసిన రేవంత్ సర్కార్…రుణమాఫీపై దమ్ముంటే చర్చకు రా.. కౌడిపల్లి వేదికగా ముఖ్యమంత్రికి హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. మెదక్ జిల్లాపై కక్ష సాధింపు.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పడావు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం..నిరుద్యోగులు ఎండ్రిన్ తాగాలా? విద్యార్థులు ‘క్రిమినల్ వేస్ట్’ ఆ? రాష్ట్రానికి రేవంత్ రెడ్డే ఒక క్రిమినల్ వేస్ట్.రైతుల భూములను 22Aలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో నిషేధిత జాబితాలో వేయాలి.కౌడిపల్లి, మహమ్మద్ నగర్ పీఏసీఎస్ లలో భారీ అవినీతి.. మంత్రి తుమ్మల, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి అన్నారు.
ఎన్నికల ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి బాండ్ పేపర్లు రాసిచ్చారు. రూ.4000 పెన్షన్, రూ.15,000 రైతుబంధు, అక్కాచెల్లెళ్లకు నెలకు రూ.2500, విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వంద కాదు వెయ్యి రోజులైంది, ఏ ఒక్క హామీకి అతీగతి లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. రేవంత్ రెడ్డి మెడలు వంచి గ్యారెంటీలు అమలు చేయించడమే మన లక్ష్యం అన్నారు.
ఈ ప్రభుత్వం కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు కానీ, కేసీఆర్ ఇచ్చిన పథకాలను పొగొడుతోంది. కేసీఆర్ గారు 60 లక్షల మందికి పైగా రైతులకు రైతుబీమా ఇచ్చారు. రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు వచ్చేవి…కానీ రేవంత్ రెడ్డి ప్రీమియం కట్టకపోవడంతో ఆగస్టు 13 నుంచి రైతుబీమా బంద్ అయింది. కరువు వచ్చినా, కరోనా వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా కేసీఆర్ రైతుబంధు ఆపలేదు.రేవంత్ రెడ్డి రూ.15 వేలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని.. మొత్తానికే ఎగ్గొట్టాడు. రైతులకు ఇవ్వాల్సిన 29 వేల కోట్ల రూపాయల రైతుబంధును రేవంత్ లూటీ చేశాడు.కాంగ్రెస్ రాగానే పాత రోజులు తెచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఉంటే, ఇప్పుడు 10 గంటల కరెంటు కూడా దొరకడం లేదు. ఆ రోజుల్లో బస్తాలు లైన్లో పెడితే, ఇప్పుడు యాప్‌ల పేరుతో రైతుల చెప్పులను లైన్లో పెట్టి ఏడిపిస్తున్నారు.
రూ.900 ఉన్న డీఏపీ బస్తా ఇప్పుడు రూ.2100కి చేరింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కలిసి యూరియా దొరకని పరిస్థితి తెచ్చాయి. పండించిన పంట అమ్ముకోవడానికి కూడా రైతులను కంటతడి పెట్టిస్తున్నారు.ఎండాకాలంలో కూడా హల్దీ, మంజీరా నదుల మీద చెక్ డ్యామ్‌లు కట్టించి, మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు పారించి వేల ఎకరాల పంటలను కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి వచ్చాక కాళేశ్వరం మోటార్లపై డ్రామాలు ఆడుతూ.. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లను డెడ్ స్టోరేజీకి తెచ్చాడు. మొన్న సంగారెడ్డికి వచ్చిన సీఎం ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. ఈ మూడేళ్లలో ఒక్క గజం కాలువ తవ్వలేదు. బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్ ఆనకట్ట, నర్సాపూర్-మెదక్ కాలువ పనులన్నీ ఆపేశారు. ఈ పనులు పూర్తైతే నర్సాపూర్ కే 70 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే సీఎంకు ఎందుకంత పగ? ఇక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవాలనుకుంటున్నారా?..కౌడిపల్లిలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. నేను ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా అన్నారు.
ముఖ్యమంత్రి.. పోలీసులు లేకుండా నువ్వు ఈ ఊరికి రా, కౌడిపల్లిలో అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మాఫీ కాలేదని తేలితే నువ్వు రాజీనామా చేస్తావా?,రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 77 సార్లు ఢిల్లీకి పోయాడు, 1000 రోజుల్లో దాదాపు 300 రోజులు అక్కడే ఉన్నాడు. ఫ్లైట్ టికెట్ల దండగ తప్ప రాష్ట్రానికి తెచ్చింది సున్నా. ఈ ప్రభుత్వ పాలన అంతా కుట్రలు, మోసాలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితమైంది.కేసీఆర్ గారు 13 లక్షల మందికి కల్యాణ లక్ష్మి ఇస్తే, రేవంత్ వచ్చాక షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి బంద్ పెట్టాడు. మహాలక్ష్మి కింద ఒక్కో ఆడబిడ్డకు ఇప్పటికే రూ.82,500 బాకీ పడ్డాడు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల కాళ్లు మొక్కి ఓట్లు వేయించుకుని.. తీరా మూడేళ్లలో కనీసం 16 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అడిగితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగమంటాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే విద్యార్థుల వీపులు పగలగొడుతున్నాడు. ఆశా, అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జ్ చేయిస్తున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటున్నాడు. అసలు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అతిపెద్ద ‘క్రిమినల్ వేస్ట్ అన్నారు’.
Also Read:యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసు
తెలంగాణ తెచ్చింది, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి తెచ్చింది, రూ.200 పెన్షన్ ను రూ.2000 చేసింది కేసీఆర్. అలాంటి గొప్ప నాయకుడిని తిట్టడానికే రేవంత్ రెడ్డి తన సమయం అంతా వృథా చేస్తున్నాడు. అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు.ఇదే కౌడిపల్లి పీఏసీఎస్‌లో ఒక్క గింజ వడ్లు కొనకుండానే కాంగ్రెస్ నాయకులు కోటి రూపాయలు స్వాహా చేశారు. మహమ్మద్ నగర్ పీఏసీఎస్‌లో జరిగిన కుంభకోణం చిట్టా కూడా మా దగ్గర ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలి. మీరు చర్యలు తీసుకోకపోతే, మేము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు.మహమ్మద్ నగర్, కౌడిపల్లిలో 200 ఎకరాలకు పైగా భూములను, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి ఎకరాల వ్యవసాయ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో పెట్టింది. దీనివల్ల రైతులకు అటు బంధు రాదు, ఇటు బీమా రాదు.. భూమి అమ్ముకునే పరిస్థితి లేదు. రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిషేధిత జాబితాలో వేసి ఓడించడం ఖాయం.కేసీఆర్ గారు తన పాలనలో 42 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, అదనంగా మరో 7 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి పేదలను ఆదుకున్నారు. కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి కొత్తవి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లకే కోతలు పెడుతూ పేదల కడుపు కొడుతున్నాడు అన్నారు.

