టీమిండియా సెలెక్టర్‌పై రోహిత్ అసంతృప్తి

1
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని సెలెక్టర్లు కోరడంపై సీనియర్ భారత బ్యాటర్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అతని భవిష్యత్తుపై రాబోయే బిసిసిఐ (BCCI) సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ వేగంగా సమీపిస్తోంది; అంతర్జాతీయ టోర్నీ కోసం ప్రపంచంలోని దిగ్గజ జట్లు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఈ మెగా ఈవెంట్‌కు ముందు అందరి దృష్టి ఖచ్చితంగా టీమిండియాపైనే ఉంటుంది.

వరల్డ్ కప్ సైకిల్ ప్రారంభమవుతున్న తరుణంలో, భారత జట్టుకు సంబంధించి అత్యంత కీలకమైన చర్చ అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజాల భాగస్వామ్యం గురించే కానుంది. వన్డే ప్రపంచ కప్ సైకిల్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 3న బిసిసిఐ నిర్వహించనున్న సమావేశంలో రోహిత్, కోహ్లీల భవిష్యత్తు ప్రధాన ఎజెండాగా మారనుంది.

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని చివరి వన్డే తర్వాత రోహిత్ శర్మను రిటైర్మెంట్ ప్రకటించాల్సిందిగా సెలెక్టర్లు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే సెలెక్టర్ల ఈ ఆదేశాలపై రోహిత్ తీవ్ర ఆగ్రహంతో పాటు తీవ్ర అసంతృప్తి చెందారని సమాచారం. ఇంగ్లండ్‌పై జరిగిన చివరి వన్డేలో రోహిత్ సాధించిన 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ సెలెక్టర్ల నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేలా చేసినప్పటికీ, 2027 వన్డే ప్రపంచ కప్‌ జట్టులో అతని స్థానాన్ని ఇంకా ఖాయం చేయలేకపోయింది.

రోహిత్ సెంచరీ చేయడానికి ముందు బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ భవిష్యత్తు వన్డే ప్రణాళికల్లో కొనసాగుతాడని స్పష్టం చేశారు. అయితే తాజాగా బయటకు వస్తున్న కథనాలు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. బోర్డు నుంచి రోహిత్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల భవిష్యత్తు మాత్రం ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాబోయే బిసిసిఐ సమావేశంలో జడేజా, కోహ్లీల భవిష్యత్తుపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Also Read:తెలంగాణకు పట్టిన శని..కాంగ్రెస్

భారత జట్టులోని ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ల విషయంలో బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో చూడాలి. ఆఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని, 2023 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలంటే టీమిండియా సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం చాలా కీలకం కానుంది.

- Advertisement -