మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్థాన్ లలో నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ దౌత్య పర్యటన మధ్య ఆసియా వ్యాప్తంగా భారత వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదటగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటన కోసం తాష్కెంట్ చేరుకోనున్నారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ తన బయలుదేరే ప్రకటనలో మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాలలో భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో గణనీయమైన పురోగతి లభించింది. వర్తకం, పెట్టుబడులు, డిజిటల్ అనుసంధానత, రక్షణ, ఇంధనం తదితర రంగాలలో మా సహకారాన్ని మరింత విస్తరించడంపై, అలాగే మా ఉమ్మడి దృక్పథాలైన ‘వికసిత భారత్’, ‘యాంగి ఉజ్బెకిస్తాన్’ల దిశగా ముందుకు సాగడంపై అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో చర్చల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
తాష్కెంట్‌లో తన పర్యటనలో భాగంగా శాస్త్రీ మెమోరియల్, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌ను సందర్శించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ ప్రదేశాలు ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలకు నిదర్శనమని అభివర్ణించారు.
Also Read:ఇమ్రాన్‌కు మద్దతుగా కమిన్స్

