ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’కి సంబంధించిన తొలి గ్లింప్స్ విడుదలైంది. ధర్మానికి, అధర్మానికి నడుమ జరిగే మహాసంగ్రామాన్ని ఆవిష్కరిస్తూ విడుదల చేసిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో అసుర గురువు ‘శుక్రాచార్య’ పాత్రలో ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా భయంకరమైన, గంభీరమైన కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆర్కేడీ స్టూడియోస్ మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ 2 నిమిషాల 55 సెకన్ల విజువల్ గ్లింప్స్ సినిమాలో శుక్రాచార్యుడి పాత్ర ఎంత కీలకమైనదో స్పష్టం చేస్తోంది. ఈ వీడియో ద్వారా నటి శ్రియా రెడ్డి పాత్రను పరిచయం చేశారు. ఆమెతో పాటు భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
గ్రాండ్ సెట్స్, ఉత్కంఠభరితమైన యుద్ద సన్నివేశాలు మరియు అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX)తో ‘మహాకాళి’ విజువల్ ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా నిర్మాతలు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ‘మహాకాళి’ చిత్రం జనవరి 8, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read:ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’
‘హను-మాన్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ప్రశాంత్ వర్మ అందిస్తున్న తదుపరి చిత్రం ఇది. భారతీయ పౌరాణిక కథలను ఆధునిక సాంకేతికతతో తెరకెక్కించే ప్రయత్నంలో భాగమే ఈ చిత్రం.

