కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చి నెరవేర్చని హామీలను ఎండగట్టడమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాచరణను వేగవంతం చేసింది. కాంగ్రెస్ పాలన “1000 రోజుల దగా” అని అభివర్ణిస్తూ, సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
వారం రోజుల పాటు సాగే ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు జరిగిన మోసాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను తీవ్రంగా వంచించిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలకు గుర్తుగా ‘బాకీ కార్డుల’ పేరుతో ఒక ప్రత్యేక ప్రచారాన్ని రూపకల్పన చేశారు. ఈ బాకీ కార్డులతో ప్రతి గ్రామంలోను, గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.
సెప్టెంబర్ 2 నుండి వారం రోజుల పాటు అన్ని మండల, గ్రామ కేంద్రాల్లో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, ఇతర ప్రధాన హామీల అమలులో ప్రభుత్వం చూపుతున్న వైఫల్యాలను ఎత్తిచూపేలా బాకీ కార్డులు రూపకల్పన చేయనున్నారు.అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో చర్చలు జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read:మనుస్మృతిపై రాహుల్ ఫైర్

