అలిపిరి–తిరుమల నడకమార్గంలో ప్రయాణించే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధునిక సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ఈ మార్గంలో చిరుతలు మరియు ఇతర వన్యప్రాణుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సరికొత్త ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్ డాగ్’ వినియోగాన్ని టీటీడీ పరిశీలిస్తోంది.
అడవిలో క్రూర మృగాల కదలికలను ముందే పసిగట్టేలా ఈ రోబోట్ డాగ్‌ను అత్యంత సాంకేతికతతో తీర్చిదిద్దారు.లైడార్ (LiDAR) సెన్సార్లు: మార్గంలో ఉన్న అడ్డంకులు, జీవుల కదలికలను ఖచ్చితంగా గుర్తిస్తాయి.చీకటిగా ఉన్నా, లేదా పొగమంచు దట్టంగా అలుముకున్నా కూడా మనుషులు, జంతువులు, వాహనాలను స్పష్టంగా వేర్వేరుగా గుర్తించగలవు.
అటవీ ప్రాంతంలో గుర్తించిన దృశ్యాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కు లైవ్ వీడియో ద్వారా పంపుతుంది.ఈ ఏఐ రోబోట్ డాగ్ క్రూర మృగాల వల్ల ఏదైనా ముప్పు ఉన్నట్లు గుర్తించిన వెంటనే, ఆ ప్రదేశానికి సంబంధించిన జియో టాగ్డ్ సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌తో పాటు సమీపంలోని పెట్రోలింగ్ సిబ్బంది మొబైల్స్‌కు హెచ్చరికల రూపంలో పంపుతుంది. దీనివల్ల అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది.
రాత్రి వేళల్లో మరియు దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం అటవీ సిబ్బందికి ఎంతో ప్రమాదకరంతో కూడుకున్నది. ఈ ఏఐ రోబోట్ డాగ్ వినియోగం వల్ల సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితంగా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. అంతేకాకుండా ఇందులో అమర్చిన ప్రత్యేకమైన సౌండ్ మరియు లైట్ సిస్టమ్ ద్వారా క్రూర మృగాలను భయపెట్టి, అవి భక్తులు నడిచే కాలినడక మార్గం వైపు రాకుండా అడవిలోకి తారసపడేలా అడ్డుకోవచ్చని టీటీడీ భావిస్తోంది.సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భక్తుల ప్రాణ రక్షణకు టీటీడీ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:మళ్లీ జైలుకు ఇమ్రాన్ ఖాన్!

