22-A పేరుతో నిలువు దోపిడీ:హరీశ్

1
- Advertisement -

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత ఆస్తుల చట్టం ‘సెక్షన్ 22-A’ను ప్రజా వేధింపులకు, అవినీతికి వేదికగా మార్చుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి ముందస్తు నివేదికలు, తనిఖీలు లేకుండా రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను ప్రొహిబిషన్ (నిషేధిత) జాబితాలో చేర్చడంపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గత 60 సంవత్సరాలుగా నివాసముంటున్న ఇళ్లను, 20-30 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా ప్రభుత్వం 22-A జాబితాలోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. శ్రీనగర్ కాలనీలోని సర్వే నంబర్లు 8, 9 లతో పాటు బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీ లాంటి నివాస ప్రాంతాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై నిలదీశారు.

హెచ్‌ఎండిఏ , హుడా అలాగే ప్రభుత్వం స్వయంగా వేలం వేసి అమ్మిన భూములు, కాలనీలు, లేఅవుట్లను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెడితే సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్తే ఎంఆర్‌ఓ దగ్గరకు, అక్కడి నుంచి ఆర్‌డిఓ, కలెక్టర్, ఆపై యూఎల్‌సి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు ప్రజల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు, చలాన్లు కట్టించుకున్న తర్వాత చివరి నిమిషంలో భూమి 22-Aలో ఉందంటూ రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారని విమర్శించారు. అలా ఆపివేసిన చలాన్ల సొమ్మును కూడా వాపస్ ఇవ్వకుండా ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందన్నారు.

1999లోనే రద్దయి, 2008లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తిగా తొలగించబడిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం భూములను మళ్లీ ఇప్పుడు తీసుకొచ్చి 22-A పరిధిలోకి తేవడం ప్రభుత్వ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. చివరికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ప్రభుత్వ భూములను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం అధికారుల పనితీరుకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వపాలనా లోపాల వల్ల ఏర్పడిన ఈ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే డిసెంబర్ 2023 నుండి 22-A జాబితాలో చేర్చిన భూములపై శ్వేతపత్రం విడుదలతో పాటు, బాధితులకు తగిన ఊరట కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

ALso Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

- Advertisement -