GHMC:లక్ష ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్..

1
- Advertisement -

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ సామాన్య ఇళ్ల యజమానుల్లోనూ ఒకేసారి తీవ్ర అలజడి రేగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు లక్షకు పైగా ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితా (Section 22-A) లోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

దశాబ్దాల క్రితం ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్లలో, అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు (HMDA/GHMC), ఎన్‌వోసీ (NOC)లు పొంది కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఈ 22-A జాబితాలోకి చేరడంతో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరాల నిమిత్తం లేదా ఇతర అవసరాల కోసం తమ ఆస్తులను అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తున్న వారికి “ఈ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది” అనే సమాధానం ఎదురవుతోంది. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు యజమానులు కలెక్టరేట్లు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ అల్లలాడుతున్నారు.

నగరంలో అత్యంత డిమాండ్ మరియు ఎక్కువ విలువ కలిగిన ప్రైమ్ ఏరియాల్లోనే ఈ ఆస్తులు ఎక్కువగా బ్లాక్‌లిస్ట్ అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ,శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, బహుదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్.

తెలంగాణ వ్యాప్తంగా 22-A కింద లక్షలాది ప్రాపర్టీలు నిషేధిత జాబితాలోకి వెళ్లగా అందులో ఏకంగా 54 శాతం ఆస్తులు కేవలం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనివే కావడం గమనార్హం. గతంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్, లేదా దేవాదాయ భూములుగా ఉన్నాయనే సాంకేతిక కారణాలతో లేదా సర్వే నంబర్ల వ్యత్యాసాల వల్ల ఈ ఆస్తులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం కేవలం కొనుగోలుదారులు, అమ్మకందారులపైనే కాక బ్యాంకింగ్ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్లాక్‌లిస్ట్ అయిన ఈ ఆస్తులలో మెజారిటీ ప్రాపర్టీలపై ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కోట్లాది రూపాయల హోమ్ లోన్లు, మార్ట్‌గేజ్ లోన్లు (ఆస్తిపై రుణాలు) మంజూరు చేశాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయా ఆస్తులపై రిజిస్ట్రేషన్లు, ఈసీ (EC) నిలిచిపోవడంతో రికవరీ ఎలా అని బ్యాంకులు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి దశాబ్దాలుగా నివాసముంటున్న బాధితులకు ఊరట కలిగించేలా 22-A జాబితాను సమీక్షించి సవరణలు చేయాలని బాధిత ఆస్తుల యజమానులు కోరుతున్నారు.

Also Read:నటి అనన్య రాజ్ కన్నుమూత

- Advertisement -