హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ మౌలిక వసతుల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటోంది. నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లు, రహదారులు సరిగ్గా శుభ్రం చేసే దిక్కు లేక చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టి, వ్యర్థాలు ఫ్లైఓవర్ల అంచుల వెంట పేరుకుపోతుండటంతో వర్షం కురిసిన ప్రతిసారీ తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. వాన నీరు ప్రవహించే క్రమంలో ఈ చెత్త అంతా కొట్టుకొచ్చి డ్రైనేజీ అవుట్‌లెట్ రంధ్రాలకు అడ్డుపడటంతో నీరు కిందకు వెళ్లలేక ఫ్లైఓవర్లపైనే భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోతోంది. దీనివల్ల వేగంగా వచ్చే వాహనాలు స్కిడ్ అవ్వడం, ఇంజన్లలోకి నీరు చేరి ఆగిపోవడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి.
అయితే ఈ సమస్యలపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న పౌరులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ…మాకేం సంబంధం లేదు, ఏమైనా ఉంటే వెళ్లి హైడ్రా (HYDRA) అధికారులకే చెప్పుకోండి అంటూ దురుసుగా సమాధానమిస్తూ తప్పించుకుంటున్నారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎమ్‌డీఏ, విద్యుత్, రెవెన్యూ వంటి కీలక శాఖలపై హైడ్రా పెత్తనం పెరుగుతుండటంతో, ఆయా విభాగాలు తమ ప్రాథమిక విధులను, పారిశుధ్య నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశాయి. రోడ్లు, ఫ్లైఓవర్లు, నాలాల నిర్వహణపై ఏ ఒక్క శాఖకు స్పష్టమైన జవాబుదారీతనం లేకపోవడంతో నగరంలో వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శాఖల మధ్య సమన్వయాన్ని పునరుద్ధరించి, రోడ్ల పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:రక్తం గడ్డకట్టడం..అవగాహన!

