ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సభకు గైర్హాజరవుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఇది పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శాసనసభకు రాకుండా, ప్రజ సమస్యలపై చర్చల్లో పాల్గొనని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నియమ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ప్రజల పన్నుల డబ్బుతో ప్రజాప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నాం. కానీ సభకు రాకుండా బాధ్యతలను విస్మరిస్తే వారికి జీతం పొందే హక్కు లేదు అని స్పీకర్ స్పష్టం చేశారు.
గత ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా లభించకపోవడం, కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సభలో తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇచ్చే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రతిపాదనలు నేరుగా వైఎస్ జగన్ మరియు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:పెద్ద మనసుతో క్షమించండి:జానీ మాస్టర్
అసెంబ్లీ నియమావళిలో మార్పుల కోసం ఏపీ స్పీకర్ పంపిన ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ప్రజాప్రతినిధుల హాజరుపై కొత్త నిబంధనలు తెస్తే.. దేశవ్యాప్తంగా చట్టసభలకు రాకుండా నిరసనలు తెలిపే ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇది చెక్ పెట్టినట్లవుతుంది. సభకు రాకపోతే రూల్స్ ప్రకారం జీతాల్లో కోత పడటంతో పాటు పదవులకు కూడా గండం పొంచి ఉండే అవకాశం ఉందని సమాచారం.

