ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు వైఖరిపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒంగోలులో జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయించడం, వారిని ఇబ్బందులకు గురిచేయడంపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు బెదిరిస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు దామచర్ల జనార్దన్!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కేవలం ఓట్లు వేయించుకోవడానికే జనసేన నాయకులు, కార్యకర్తలు పనికొస్తారా అని ఆయన నిలదీశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి జనసేన శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.
జనసేన కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. “ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి బెదిరింపులకు దిగినా భయపడే ప్రసక్తే లేదు. జనసేన సైనికుల జోలికి వస్తే సహించేది లేదు” అని దామచర్ల జనార్దన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు
ఒంగోలు నియోజకవర్గంలో ఇరు పార్టీల కీలక నాయకుల మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం సాగుతుండటంతో కూటమి శ్రేణుల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతోంది.

