ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి నిధుల ప్రవాహాన్ని నిలిపివేసే లక్ష్యంతో, రష్యా నుండి క్రూడ్ ఆయిల్ (గ్యాస్) కొనుగోలు చేస్తున్న భారత్, చైనాతో సహా ఐదు దేశాల దిగుమతులపై 100 శాతానికి పైగా పన్నులు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే నూతన బిల్లును US సెనెట్ ఆమోదించింది.ఈ బిల్లు సెనెట్‌లో 86-11 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఇటీవలే మరణించిన రిపబ్లికన్ సెనేటర్ గౌరవార్థం ఈ బిల్లుకు “లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” అని పేరు పెట్టారు.
రష్యా నుండి అత్యధికంగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న టాప్-5 దేశాలైన భారత్, చైనా, అజర్బైజాన్, హంగేరీ, స్లొవేకియాలపై పన్నులు విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.చైనా తర్వాత రష్యా క్రూడ్ ఆయిల్‌ను అతిపెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న దేశం భారత్. 2025 ఆగస్టు నుండి ఇప్పటికే ఉన్న 50% సుంకాలకు అదనంగా, ఈ కొత్త నిర్ణయం అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఈ బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పన్నులు వెంటనే అమలులోకి రావు. ఈ సుంకాలను విధించే పూర్తి అధికార నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే వదిలివేశారు.ఈ బిల్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యన్ అధికారులు, వారి ఆర్థిక సంస్థలు మరియు అక్రమంగా చమురు రవాణా చేసే ‘షాడో ఫ్లీట్’ ఓడలపై కూడా ప్రత్యక్ష ఆంక్షలు విధిస్తుంది.
2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, భారత్ తక్కువ ధరలకు లభించే రష్యా క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తోంది. దేశీయ ఇంధన భద్రత మరియు సరఫరా స్థిరత్వం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. 2026 జూన్ నెలలో కూడా భారత్ రష్యా నుండి చమురు దిగుమతులను రికార్డు స్థాయిలో పెంచింది. అమెరికాతో వ్యాపారం చేయడమా లేక రష్యా నుండి చవకైన ఇంధనాన్ని కొనడమా అనే రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఈ బిల్లు ఇతర దేశాలను ఆదేశిస్తుందని ప్రతిపాదకులు పేర్కొన్నారు.
Also Read:కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి రిజిజు సవాల్
కొంతమంది డెమోక్రటిక్ ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ, ఇది అధ్యక్షుడికి ఏకపక్ష అధికారాలను కట్టబెడుతుందని మరియు వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇప్పుడు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (దిగువ సభ) పరిశీలనకు వెళ్లనుంది. ఆగస్టు 31న హౌస్ తిరిగి సమావేశమైనప్పుడు దీనిని పరిశీలించి ఆమోదిస్తే, ఆపై అధ్యక్షుడి సంతకంతో ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది.

