ఏపీ కూటమి ప్రభుత్వంలో చేపట్టిన డీఎస్సీ (DSC) నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ (YSRCP) అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దవులూరి దొరబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమాలను నిరసిస్తూ ఆగస్టు 6, 7 తేదీల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విస్తృత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా దవులూరి దొరబాబు మాట్లాడుతూ.. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆరోపించారు.డీఎస్సీ నియామకాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, అధికార టీడీపీ, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకుల బంధువులకే ప్రాధాన్యతనిచ్చారని మండిపడ్డారు.
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) లేదా న్యాయస్థానం (కోర్టు) పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ నియామక అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన నిరుద్యోగులకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 6, 7 తేదీల్లో చేపట్టే ఈ నిరసన కార్యక్రమాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

