భారత్ రాష్ట్ర సమితి (BRS) సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో అర్థరాత్రి 12:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా మరణించారనే వార్త వినగానే నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన సుదర్శన్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేశారు.
Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?
ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఒక మంచి నాయకుడిని, నర్సంపేట ప్రజలు ఒక అంకితభావం కలిగిన నేతను కోల్పోయారని పలువురు నేతలు కొనియాడారు.

