9వ తరగతి నుంచి మూడో భాషను ప్రవేశపెట్టే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని పేర్కొంది.
జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విధానంపై అభిప్రాయం వ్యక్తం చేసింది. 9వ తరగతి విద్యార్థులు ఇప్పటికే అధిక విద్యా ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో భాషను చేర్చడం వారిపై భారం పెంచుతుందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.
మూడో భాష (R3)పై సీబీఎస్ఈ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో చేరే విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాల్సి ఉంటుంది. అయితే ఈ మూడో భాషకు సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఉండదు.
పాఠశాలలే అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) నిర్వహిస్తాయి. విద్యార్థులు ఈ మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అర్హత సాధించకపోతే, ఆయా పాఠశాలలు మళ్లీ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించే అవకాశం కల్పిస్తాయి. ఈ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించినప్పుడే 10వ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం జారీ అవుతుంది.
సీబీఎస్ఈ తాజా నిబంధనల ప్రకారం విద్యార్థులు ఎంచుకునే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. మూడో భాషగా ఇంగ్లిష్‌తో పాటు ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, స్పానిష్ వంటి విదేశీ భాషలను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. అయితే మిగిలిన రెండు భాషలు భారతీయ భాషలే కావాలి.భారతీయ భాషల జాబితాలో హిందీ, సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, ఒడియా, అస్సామీ తదితర భాషలు ఉన్నాయి.
2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉన్న విద్యార్థులకు ప్రస్తుతం అమలులో ఉన్న రెండు భాషల విధానమే కొనసాగుతుంది. వారికి మూడో భాష తప్పనిసరి కాదు.జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా సీబీఎస్ఈ R1, R2, R3 పేర్లతో మూడు భాషల విధానాన్ని అమలు చేస్తోంది.
R1 – ప్రధాన భాష
R2 – రెండో భాష
R3 – మూడో భాష
2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తూ, 2030-31 నాటికి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీబీఎస్ఈ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విద్యారంగంలో చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులపై విద్యా భారం పెరగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.
Also Read:ఒకే దేశం-ఒకే ఎన్నికలు..భిన్న వాదనలు?

