ఒకచోట నలుగురు కూర్చుంటే దోమలు మిగతా వారందరినీ వదిలేసి, మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? అయితే అది మీ భ్రమ కాదు, నిజమే. దోమలు అందరినీ ఒకేలా చూడవు. కొందరి శరీర తత్వం, జీవక్రియలు దోమలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
దోమల్లో కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. వాటి గుడ్ల ఉత్పత్తికి అవసరమైన ప్రోటీన్ కోసం అవి మానవ రక్తంపై ఆధారపడతాయి. మనుషులను గుర్తించడానికి అవి ప్రధానంగా చూపును, వాసనను నమ్ముకుంటాయి. ఇందుకోసం మనం శ్వాస విడిచినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ (CO₂) దోమలకు బలమైన సిగ్నల్‌గా పనిచేస్తుంది.
గర్భధారణ సమయంలో మహిళల శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు, వారు శ్వాస వేగంగా తీసుకుంటారు. దీనివల్ల ఎక్కువ CO₂ విడుదలై దోమలు వారి వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరం వేడెక్కుతుంది. అలాగే చెమట ద్వారా లాక్టిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఇది దోమలకు అత్యంత ఇష్టమైన వాసన.దోమలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కుట్టాలా వద్దా అనేది మీ శరీర వాసనే డిసైడ్ చేస్తుంది.
పరిశోధనల్లో తేలింది ఏంటంటే..మన చర్మంపై ఉండే బ్యాక్టీరియా కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసినప్పుడు ‘కార్బాక్సిలిక్ యాసిడ్స్’ వంటి సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇవి కొందరి చర్మంపై చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నవారిని దోమలు 100 రెట్లు ఎక్కువగా ఆకర్షిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.ప్రతి ఒక్కరి చర్మంపై ఉండే బ్యాక్టీరియా మిశ్రమం వేర్వేరుగా ఉంటుంది. ఇది కూడా మన శరీర వాసనను ప్రభావితం చేస్తుంది. మన చర్మ తత్వాన్ని మరియు వాసనను నిర్ణయించడంలో మన జన్యువులు (జీన్స్) కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కొందరికి పుట్టుకతోనే దోమలను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది.
Also Read:రేవంత్ నిర్లక్ష్యం వల్లే సుప్రీంలో చుక్కెదురు
పెద్దలు, కాస్త లావుగా ఉండే వ్యక్తులు పిల్లల కంటే ఎక్కువ మోతాదులో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. అందుకే వీరిపై దోమల దాడి ఎక్కువగా ఉంటుంది.దోమల నివారణ ట్రాప్‌లలో కూడా ఈ CO₂ గ్యాస్‌ను ఉపయోగించే దోమలను ఆకర్షిస్తుంటారు.శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారిని దోమలు సులభంగా గుర్తిస్తాయి.
అందరినీ ఒకే సంఖ్యలో దోమలు కుట్టినప్పటికీ, కొందరిలో ఆ మచ్చలు పెద్దగా అయ్యి విపరీతంగా దురద పెడతాయి. మరికొందరిలో ఎలాంటి వాపు, దురద లేకుండా సాధారణంగానే ఉంటుంది. మన రోగనిరోధక శక్తి దోమ లాలాజలానికి ఎలా స్పందిస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. దీనివల్ల కూడా నన్నే దోమలు ఎక్కువగా కుడుతున్నాయి అని కొందరు భావిస్తుంటారు.

