నాలుగేళ్లలో 1.27 కోట్లు కొట్టేశారు!

3
- Advertisement -

భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లు, దిండ్లు వంటి లినెన్ వస్తువుల చోరీ ఆందోళనకర స్థాయికి చేరింది. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం….గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల నుంచి సుమారు 1.27 కోట్ల లినెన్ వస్తువులు కనిపించకుండా పోయాయి.

చోరీకి గురైన వాటిలో బెడ్‌షీట్లు, తువ్వాళ్లు, దిండ్ల కవర్లు, దుప్పట్లు వంటి వస్తువులే అధికంగా ఉన్నాయి. ప్రతి రోజు లక్షలాది మంది ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తుండగా, ప్రయాణికుల వినియోగం కోసం ప్రత్యేకంగా ఈ లినెన్‌ను రైల్వే అందిస్తోంది. అయితే కొందరు వాటిని అనుమతి లేకుండా వెంట తీసుకెళ్లడం వల్ల ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వస్తువులు మాయమవుతున్నాయని అధికారులు గుర్తించారు.

ఈ పరిస్థితి రైల్వే నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది. పోయిన లినెన్ స్థానంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయాల్సి రావడంతో కోట్ల రూపాయల అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రతి ప్రయాణికుడికి పరిశుభ్రమైన లినెన్ అందించాలంటే భారీ స్థాయిలో ఉతికించడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం వంటి ప్రక్రియలు కూడా మరింత వ్యయభారంగా మారుతున్నాయి.

లినెన్ చోరీలను అరికట్టేందుకు రైల్వే శాఖ పలు చర్యలు చేపడుతోంది. బెడ్‌రోల్ నిర్వహణను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడం, కోచ్ అటెండెంట్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, అవసరమైన చోట సీసీటీవీ నిఘా పెంచడం వంటి చర్యలను పరిశీలిస్తోంది. అలాగే ప్రయాణికుల్లో అవగాహన కల్పిస్తూ, రైల్వే ఆస్తులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.

Also Read:ఓ.! సుకుమారి..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

రైల్వే అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ, ఏసీ కోచ్‌లలో అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లు తదితర వస్తువులు పూర్తిగా రైల్వే ఆస్తులేనని, ప్రయాణం ముగిసిన తర్వాత వాటిని కోచ్‌లోనే వదిలివేయాలని సూచిస్తున్నారు. ప్రయాణికుల సహకారంతోనే ప్రజాధనాన్ని కాపాడటం, సేవల నాణ్యతను మెరుగుపరచడం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -