తెలుగు చిత్రసీమలో వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తన కూతురు మాధవితో కలిసి రోడ్డున పడ్డ వైనం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి గేటు వద్ద పావలా శ్యామల, ఆమె కుమార్తె మాధవిలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడ దీన స్థితిలో ఉన్న ఆమెను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన వైద్యులు ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెకు ఛాతీకి సంబంధించిన (ఊపిరితిత్తుల) సమస్యలు ఏవీ లేవని తేలడంతో, తదుపరి జనరల్ వైద్య పరీక్షల నిమిత్తం అధికారుల సూచన మేరకు వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read:కామిశెట్టి దర్శకత్వంలో రోషన్!
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండలేక, పర్యవేక్షించే వారు లేకపోవడంతో పావలా శ్యామల, ఆమె కూతురు మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి వద్దకే తిరిగి వచ్చేసారు. తమకు దిక్కు ఎవరూ లేరంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తిరిగి ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పావలా శ్యామల, ఆమె కుమార్తె ఉన్న దీన స్థితిని చూసి చలించిపోయారు. వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడంతో పాటు తగిన సంరక్షణ అందించేలా, ఇద్దరినీ సురక్షితంగా నగరంలోని ఒక అనాధాశ్రమానికి తరలించారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వించిన నటి.. జీవిత చరమాంకంలో ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడంపై సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

