ఎండవేడిమి నుండి ఉపశమనం కలిగించే వర్షాకాలం గర్భిణీ స్త్రీలకు మాత్రం కొన్ని ప్రత్యేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి సాధారణంగానే కాస్త తక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు ఇన్ఫెక్షన్లు, ఆహార కాలుష్యం, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పును పెంచుతాయి.
వర్షాకాలంలో టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. గర్భధారణ సమయంలో వచ్చే చిన్నపాటి కడుపునొప్పి లేదా విరేచనాలు కూడా డీహైడ్రేషన్‌కు దారితీసి గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతాయి. అందుకే కేవలం ఫిల్టర్ చేసిన, కాచి చల్లార్చిన నీటిని లేదా నమ్మకమైన బ్రాండ్ బాటిల్ నీటిని మాత్రమే తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు సొంత నీటి బాటిల్ తీసుకెళ్లడం మంచి అలవాటు. వర్షంలో రోడ్డు పక్కన దొరికే చాట్, స్నాక్స్ ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. పీల్ (తొక్క) తీయగల తాజా పండ్లు, బాగా ఉడికించిన కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, పాలు, లీన్ మీట్ వంటి మంచి ప్రొటీన్లు ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. బయట తయారుచేసే పచ్చి సలాడ్లు, సరిగ్గా ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి.
వర్షాకాలంలో ఉండే తేమ, వెచ్చదనం కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా చర్మ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు. తరచుగా చేతులు కడుక్కోవడం, రోజూ స్నానం చేయడం, కాటన్ దుస్తులు ధరించడం ముఖ్యం. ఒకవేళ వర్షంలో తడిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పొడి బట్టలు మార్చుకోవాలి. డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులు గర్భధారణ సమయంలో తీవ్రమైన కాంప్లికేషన్స్ సృష్టిస్తాయి. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పేలా ఉండే దుస్తులు ధరించడం, రాత్రి పూట దోమతెరలు వాడటం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల నివారణ సాధ్యమవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వాడే మస్కిటో రిపెల్లెంట్లు (దోమల నివారణ మందులు) సురక్షితమైనవేనా కాదా అనేది వైద్యులను అడిగి తెలుసుకోవాలి. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
Also read:Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్‌డేట్
వర్షాల వల్ల రోడ్లు, మెట్లు జారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు మంచి గ్రిప్ ఉన్న పాదరక్షలు ధరించాలి. నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణాలు నివారించడం, మెట్లు ఎక్కేటప్పుడు హ్యాండ్‌రైల్స్ పట్టుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు పడిపోకుండా కాపాడతాయి. ఒకవేళ పొరపాటున కింద పడితే, పైకి ఎలాంటి నొప్పులు లేకపోయినప్పటికీ వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని అంతర్గత సమస్యలు వెంటనే బయటపడవు. వాతావరణం బాలేదని రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌లను వాయిదా వేయకూడదు. ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని ప్రయాణ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. గర్భస్థ శిశువు కదలికలు తగ్గడం, బ్లీడింగ్ కావడం, విపరీతమైన కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ అత్యవసర వైద్యంగా భావించి ఆసుపత్రికి వెళ్లాలి.

