లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ – 2026’ లో మన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ మోడల్ హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ మాజీ సభ్యులు (2018-2024), ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ బృహత్తర పర్యావరణ ఉద్యమంపై లండన్ బరో ఆఫ్ రెడ్‌బ్రిడ్జ్ (Redbridge) టౌన్ హాల్లో జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. పౌరుల భాగస్వామ్యంతో వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కోవచ్చో ఈ తెలంగాణ మోడల్ ప్రపంచానికి ప్రాక్టికల్‌గా చాటిచెబుతోందని కొనియాడారు.
అబ్దుల్ కలాం స్ఫూర్తితో
“మనసులను రగిలిస్తే, సమాజం మారుతుంది” అనే బలమైన నినాదంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సదస్సులో కీలక ప్రసంగం చేశారు. భారత రత్న డా.ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో తెలంగాణలోని ఒక గ్రామంలో మొదలైన ఈ ఉద్యమం.. నేడు అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరిందో ఆయన వివరించారు. ఇప్పటివరకు 4.4 కోట్ల మంది పౌరుల భాగస్వామ్యంతో ఏకంగా 19.6 కోట్ల మొక్కలను నాటడమే కాకుండా, 2024 నుంచి శాటిలైట్ మానిటరింగ్, జియో-ట్యాగింగ్ ద్వారా ప్రతి మొక్కనూ అత్యంత పారదర్శకంగా సంరక్షిస్తున్నామని తెలిపారు.
మొక్కలు నాటడమే కాకుండా భారీ స్థాయిలో నీటి సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పర్యావరణ పరిరక్షణ కోసం యువతను చేంజ్ మేకర్స్‌గా ఎలా తీర్చిదిద్దుతున్నారో సంతోష్ కుమార్ వివరించారు. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు గ్లోబల్ లీడర్స్ మద్దతు
సంతోష్ కుమార్ విజన్‌కు సదస్సులో పాల్గొన్న దిగ్గజాలు పూర్తి మద్దతు ప్రకటించారు. సురేష్ యాదవ్ (కామన్వెల్త్ సెక్రటేరియట్ సీనియర్ డైరెక్టర్) మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రజలు నడిపించే ఇలాంటి ఉద్యమాలు గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌కు ఎంతో అవసరమని అన్నారు.
జస్ అత్వాల్ (ఇల్ఫోర్డ్ సౌత్ ఎంపీ), డాక్టర్ రాజేష్ జీతా (మారిషస్ హైకమిషనర్) కూడా స్థానిక, జాతీయ స్థాయిల్లో పబ్లిక్ పాలసీ, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తేనే నిజమైన ఫలితాలు వస్తాయని, ద్వీప దేశాలకు ఈ మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

స్థానిక కౌన్సిల్ నేతల ప్రశంసలు
రెడ్‌బ్రిడ్జ్ మేయర్ కౌన్సిలర్ బెర్ట్ జోన్స్ సదస్సుకు స్వాగతం పలుకుతూ.. తమ రెడ్‌బ్రిడ్జ్ కమ్యూనిటీలకు కూడా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఒక అద్భుతమైన మార్గదర్శకమని కొనియాడారు. స్థానిక ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఈ కార్యక్రమం నిరూపించిందని డిప్యూటీ లీడర్ వనీషా సోలంకి, కౌన్సిలర్ జో బ్లాక్‌మన్, ఐసీఎస్ఆర్ హెడ్ డా.ఓర్నిచా డౌరుయెంగ్, ట్రీహౌస్ నర్సరీల సీఈవో నాజియా తదితరులు ప్రశంసించారు.
భవిష్యత్ కార్యాచరణ: వసుధైక కుటుంబకం
‘వసుధైక కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే స్ఫూర్తితో అంతర్జాతీయ సహకారం మరింత పెరగాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. లండన్ నుంచి గ్లాస్గో, ఆంటిగ్వా సదస్సుల మీదుగా రాబోయే హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026 వరకు ఈ ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సరైన నాయకత్వం ఉంటే సామాన్యులు కూడా అసాధారణమైన పర్యావరణ మార్పులు తీసుకురాగలరని ఈ సదస్సు నిరూపించింది.
పర్యావరణ పరిరక్షణ, యువత సాధికారతే లక్ష్యంగా
డా.ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనల స్ఫూర్తితో హైదరాబాద్‌లో ఏర్పాటైన నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, యువత సాధికారతే దీని లక్ష్యం. గ్రీన్ ఇండియా చాలెంజ్, వాక్ ఫర్ వాటర్ ద్వారా 33 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ.. 19.6 కోట్ల పైగా మొక్కలు నాటి, 21 వేలకు పైగా నీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పర్యావరణ రంగంలో వీరి సేవలకు గుర్తింపుగా UNFCCC COP29, UNCCD COP16 సదస్సులలో వీరికి అబ్జర్వర్ హోదా కూడా దక్కింది. మరింత సమాచారం కోసం www.ignitingminds.org వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

