బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడంతో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం కారణంగా చెట్లు పడిపోవటం,పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగడం,పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న జనానికి పరిష్కారంగా.. GHMC అప్రమత్తమైంది. వానలపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. నగర వాసులు తమ కాలనీల్లో వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను తెలిపేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూం. నెంబర్ 100 లేదా 21111111ను ఏర్పాటు చేశారు. ఈ సేవల కోసం 24/7 హెల్ప్ డెస్క్ ను అందుబాటులో ఉంచారు GHMC అధికారులు. 590 మంది సిబ్బందితో 140 మొబైల్, మినీ మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసిన అధికారులు.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒక సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్ ను అందుబాటులో ఉంచారు. 5 జోన్లలో 5 టీమ్స్, 30 సర్కిళ్లలో 30 టీమ్స్ ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది GHMC.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డికపూల్, నారాయణగూడ, హిమాయత్నగర్లో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ లోని లోతట్టు ప్రాంతాలైన వారాసిగూడ, మధురానగర్, న్యూ అశోక్నగర్ కాలనీల్లో రహదారులు కుడా నీటితో నిండాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన మార్గాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని కూకట్‌పల్లి-మియాపూర్ మార్గంలో వాహనరాకపోకలు స్తంభించాయి. రహదారిపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈసీఐఎల్, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాచిగూడ క్రాస్‌రోడ్, మాసబ్ ట్యాంక్ కట్టమైసమ్మ ఆలయం, నాంపల్లి టి.జంక్షన్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, టోలిచౌకి సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్ ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ వద్ద ఓ చెట్టు విరిగిపడింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో ఓ వృక్షం నేలకూలింది.