తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం సందడి చేసింది. ఈ ఉదయం ఆయన తన కుమారుడు, కోడలితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న అంబానీ కుటుంబం.. స్వామివారి అత్యంత పవిత్రమైన అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు చేరుకున్న ముకేశ్ అంబానీ కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘన స్వాగతం పలికారు. వీరికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరోవైపు, ఈరోజు తిరుపతిలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ దృష్ట్యా పీఠాధిపతులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. దీంతో కొండపై వీఐపీల తాకిడి గణనీయంగా పెరిగింది.
వీఐపీల రాకతో పాటు వేసవి రద్దీ కూడా తోడవడంతో సామాన్య భక్తులకు దర్శన సమయం భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి (ఉచిత దర్శనం) దాదాపు 18 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, అదనపు ఏర్పాట్లను చేస్తున్నారు.
Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ

