దక్షిణాసియా దేశాలలో వ్యవసాయ ,ఆహార వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాలలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలలో పెరుగుతున్న యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన దక్షిణాసియాలో వ్యవసాయ రూపాంతరీకరణ మరియు ఉపాధి అవకాశాలు అనే నివేదిక ప్రకారం.. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి అత్యాధునిక సాంకేతికత వైపు అడుగులు వేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చవచ్చు. ఈ మార్పు కేవలం పంటల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, సప్లై చైన్, ఆహార ప్రాసెసింగ్ , ప్యాకేజింగ్, రవాణా మరియు మార్కెటింగ్ రంగాలలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. దక్షిణాసియాలో ఇప్పటికీ మెజారిటీ జనాభా జీవనోపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. అయితే, ఈ రంగాన్ని కేవలం పంటలు పండించడానికే పరిమితం చేయకుండా, డిజిటల్ టెక్నాలజీ మరియు అగ్రి-టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా ఉత్పాదకతను భారీగా పెంచవచ్చు. ఇది గ్రామీణ యువతకు నాణ్యమైన ఉద్యోగాలను అందించడమే కాకుండా నగరాలకు వలసలను కూడా తగ్గిస్తుంది అని పేర్కొన్నారు.
అయితే ఈ లక్ష్యాలను సాధించడానికి కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని నివేదిక హెచ్చరించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు , నీటి కొరత మరియు భూగర్భ జలాలు క్షీణించడం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ‘వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలను’ అవలంబించాలని సూచించింది. ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగాలు కలిసి మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు పెట్టాలని, రైతులకు సులభంగా రుణాలు అందేలా చూడాలని ప్రపంచ బ్యాంక్ సిఫార్సు చేసింది.
AlsoRead:విమల్ కృష్ణ..’అనుమాన పక్షి’
మహిళా సాధికారతకు కూడా ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుందని నివేదిక హైలైట్ చేసింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా కుటుంబాల ఆదాయం పెరిగి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. సరిహద్దు వాణిజ్యాన్ని మెరుగుపరుచుకుంటే దక్షిణాసియా దేశాలు ప్రపంచ ఆహార మార్కెట్‌లో అగ్రగామిగా ఎదగగలవని నివేదిక ముగించింది.

