IPL:జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ రికార్డు

4
- Advertisement -

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో విజృంభించడంతో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ప్రదర్శనతో ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆర్చర్ తన అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ తరపున 68వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న షేన్ వాట్సన్ (67 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల విషయానికొస్తే.. జోఫ్రా ఆర్చర్ 68, షేన్ వాట్సన్ 67, యుజ్వేంద్ర చాహల్ 66, సిద్ధార్థ్ త్రివేది 65, షేన్ వార్న్ 58 ఉన్నారు.

పవర్‌ప్లేలో ఐడెన్ మార్క్రామ్‌ను డకౌట్ చేసిన ఆర్చర్, డెత్ ఓవర్లలో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్‌లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఆర్చర్ ప్రస్తుత సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి తన టీమ్ మేట్ రవి బిష్ణోయ్‌తో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (8), ధ్రువ్ జురెల్ (0) త్వరగా నిష్క్రమించగా, యశస్వి జైస్వాల్ కూడా రాణించలేకపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి 43 నాటౌట్ పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేయగలిగింది.

ALso Read:సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

- Advertisement -