రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ (JAC) ఇచ్చిన పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచే ఉద్యోగులు విధులను బహిష్కరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం చర్చల పేరుతో కాలాపహరణం చేస్తోందని ఆర్టీసీ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మెను ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు.
సమ్మె నోటీసు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలవడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తాము కోరుతున్నవి కొత్త డిమాండ్లు కావని, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సమస్యలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.కేవలం ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు.
సమ్మె ప్రభావంతో తెల్లవారుజాము నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లలోనే వేచి చూస్తున్నారు. మంచీర్యాల వంటి డిపోలలో దాదాపు 142 బస్సులు నిలిచిపోయాయి.బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.సమ్మె విచ్ఛిన్నం కాకుండా ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లలో అద్దె బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలో జేఏసీ నాయకులు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?
ప్రస్తుతానికి చర్చలు విఫలమైనప్పటికీ, గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈరోజు మరోసారి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని కార్మిక సంఘాలు భీష్మించుకున్నాయి.

