నేపాల్ మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్టుపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తీవ్రంగా స్పందించింది. అరెస్టుకు సరైన ఆధారాలు లేవని, ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించింది. పార్టీ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, విచారణ కమిటీ నివేదికలో ఓలి అరెస్టుకు సరిపడే ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆ నివేదిక ఉద్దేశపూర్వకంగా తయారు చేసినదని విమర్శించారు.
నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ మాట్లాడుతూ…. మా పార్టీ అధ్యక్షుడిపై ఇది రాజకీయ ప్రతీకారం అని పేర్కొన్నారు. ఓలి అరెస్టుకు ప్రతిస్పందనగా పార్టీ అత్యవసర కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓలిని భక్తపూర్లోని ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2025లో జరిగిన జెన్-జెడ్ నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఆందోళనల అణచివేతకు సంబంధించిన కేసులో ఈ అరెస్టు జరిగింది.
ఇక నేపాలి కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి రమేష్‌ను కూడా ఇదే కేసులో ముందుగా అరెస్ట్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమై, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. మాజీ న్యాయమూర్తి బహదూర్ కర్కి నేతృత్వంలోని కమిషన్ నివేదిక ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆ నివేదికలో ఓలి, లేఖక్ మరియు అప్పటి పోలీస్ ఉన్నతాధికారులపై నేరపూరిత నిర్లక్ష్యం ఆరోపణలు మోపాలని సూచించారు.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!
నేపాల్ నేషనల్ పీనల్ కోడ్ సెక్షన్లు 181, 182 కింద కేసులు నమోదు చేయాలని కమిషన్ సూచించింది. ఈ కేసుల్లో గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్‌లో జరిగిన జెన్-జెడ్ ఆందోళనల సమయంలో 77 మంది మృతి చెందగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని కమిషన్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

