దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధురంధర్ సినిమా చూసిన తర్వాత తనకు ఆదిత్య ధర్‌పై మరింత గౌరవం పెరిగిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ చిత్రంలోని మేకింగ్, టేకింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు.
ఆదిత్య ధర్ తన ప్రత్యేకమైన శైలితో సినిమా నిర్మాణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లారని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో పరిశ్రమలో ఆయన విజయాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. కొత్త తరహా యాక్షన్ మేకింగ్ కారణంగా కొన్ని పెద్ద సినిమాల టీమ్‌లు తమ ప్రాజెక్టులను తిరిగి పరిశీలించి రీషూటింగ్ చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు. దీంతో కొంతమంది నిర్మాతలు నష్టపోతున్నారని, అందుకే ఆదిత్య ధర్ మరియు ఆయన భార్య యామీ గౌతమ్ పై విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ విజయంతో ఇప్పుడు సీక్వెల్‌గా ధురంధర్ ది రీవెంజ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

